A2న్యూస్, జులై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (24) ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ స్థాయిలో తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలాల వారీగా ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో చేపట్టి, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే 97 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను నిర్ణీత గడువుకు ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పురోగతిని వివరిస్తూ మెదక్ – 96%, పాపన్నపేట – 95%, శంకరంపేట – 100%, రామాయంపేట – 97%, హవేలీ ఘనపూర్ – 98%, నిజాంపేట – 96%, నర్సింగ్ి – 99% మేర నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ బీఎల్‌వోల నుంచి పురోగతి నివేదికలు సేకరించాలని, ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అలాగే బీఎల్‌ఏలు, కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ జాబితాలను బీఎల్‌ఏలకు అందించి వారిని భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు గఫార్, మెదక్ డివిజన్‌కు చెందిన మండలాల తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

