భూగర్భ జలాల పెంపు, సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలి
వీబీ-జీ రామ్‌జీ కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
A2న్యూస్, జులై 25, మెదక్ జిల్లా ప్రతినిధ (రాము)
మెదక్ జిల్లా (24) వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల సంరక్షణ, పెంపు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ-జీ రామ్‌జీ) కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వీబీ-జీ రామ్‌జీ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని, భూగర్భ జలాల పెంపునకు ప్రస్తుతం అనుకూల సమయమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వర్షపు నీటి ప్రతి చుక్క భూమిలోకి ఇంకేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
నీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫామ్ పాండ్‌లు, వ్యక్తిగత ఫామ్ పాండ్‌లు, బోరుబావుల రీఛార్జ్ పిట్‌లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, పర్కోలేషన్ ట్యాంకుల నిర్మాణాలను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం లేదా సాకులతో కాలయాపన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి మండలంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించి పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకృతి విపత్తులను సమిష్టిగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఉపయోగపడే విధంగా భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్యతో పాటు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

