A2న్యూస్, జులై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
వెల్దుర్తి (17) వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డా. గణేశ్వర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులతో ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కలుషిత ఆహారం, నీరు తీసుకోకుండా వేడి ఆహారం మాత్రమే తినాలని, శుభ్రమైన తాగునీటినే వినియోగించాలని సూచించారు. ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడం, దోమలు, ఈగలు చేరకుండా చర్యలు తీసుకోవడం, చేతుల పరిశుభ్రత పాటించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. జలుబు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవాలని విద్యార్థినులకు సూచించారు. 14–15 సంవత్సరాల వయస్సు గల బాలికలు హెచ్‌పీవీ (హెచ్ పి వి) వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని, జిల్లాలో ఇప్పటికే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్ సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని వివరించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్బెండజోల్ మాత్ర తీసుకోని విద్యార్థులు ఈ నెల 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్ర తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులు చదువు పూర్తయ్యే వరకు, ఆర్థికంగా స్వావలంబన సాధించే వరకు, కనీసం 21 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని డా. గణేశ్వర్ సూచించారు. చిన్న వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు రక్తహీనత, గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. అనంతరం హాస్టల్ గదులు, వంటశాల, వంట సామగ్రి, తాగునీటి సౌకర్యం, వాష్‌రూములు, మురుగు నీటి కాలువలు, పాఠశాల ఆవరణను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫుడ్ పాయిజనింగ్, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెడ్‌మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులకు సూచించారు.

