A2న్యూస్, జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తూప్రాన్ (7) జాతీయ రహదారి-44పై భద్రతా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌ను ఆయన తనిఖీ చేసి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది అనుసరిస్తున్న విధానాలు, సమాచార సేకరణ, స్థానిక పోలీసు స్టేషన్లతో సమన్వయం, స్పందించే తీరు గురించి అదనపు ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్‌ఐ గంగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

