కలెక్టరేట్ కార్యాలయాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు వేగవంతం
వివిధ శాఖల అధికారులకు నాలుగు రకాల డస్ట్బిన్ల పంపిణీ
A2న్యూస్ జులై 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (6) స్వచ్ఛ కలెక్టరేట్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి పరిశుభ్రమైన కలెక్టరేట్‌గా తీర్చిదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు నాలుగు రకాల డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల నుంచే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మెదక్ నిర్మాణానికి అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యాలయంలో నాలుగు రంగుల డస్ట్బిన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్తలను విడివిడిగా సేకరించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి కార్యాలయంలో ఒక అధికారిని ప్రత్యేక బాధ్యుడిగా నియమించి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్దనే ఘన వ్యర్థాలను నాలుగు విభాగాలుగా వేరు చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. తడి చెత్త కోసం ఆకుపచ్చ రంగు డస్ట్‌బిన్, పొడి చెత్త కోసం నీలం రంగు డస్ట్‌బిన్, సానిటరీ చెత్త కోసం ఎరుపు రంగు డస్ట్‌బిన్, ప్రత్యేక జాగ్రత్త చెత్త కోసం నలుపు రంగు డస్ట్‌బిన్ ఉపయోగించాలని వివరించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

