అక్రమ రీఫిల్లింగ్, నిల్వపై కఠిన చర్యలు తప్పవు: డీఎస్ఓ పి. నిత్యానందం
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 27:
మనోహరాబాద్ (26) మెదక్ జిల్లా కాళ్లకల్ గ్రామ శివారులో శనివారం అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి రీఫిల్లింగ్ చేస్తున్న గోదాంపై సివిల్ సప్లై, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం ఆదేశాల మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సిములు, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో గోదాంలో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన మొత్తం 296 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా భారీగా సిలిండర్లను నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలతో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం పేర్కొన్నారు.
జిల్లాలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, సిలిండర్ల అక్రమ నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తించినా, లేదా వాటికి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రజలను కోరారు.

