Tuesday, October 13, 2026
Homeమెదక్మెతుకు సీమలో పర్యాటక పండుగ.. 4 వేల మందితో భారీ ర్యాలీ

మెతుకు సీమలో పర్యాటక పండుగ.. 4 వేల మందితో భారీ ర్యాలీ

📰 Generate e-Paper Clip

16 కళారూపాలతో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ

మెదక్‌ను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం: ఎంపీ రఘునందన్‌రావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 28:

మెదక్ జిల్లా (27) ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. సుమారు 4 వేల మంది పాల్గొన్న భారీ ర్యాలీ మెదక్ ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు ఉత్సాహభరితంగా సాగింది. మెదక్ ఖిల్లాపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో డప్పు, డోలు, తంబుర, చిందు, భాగవతం, బోనాలు, బతుకమ్మ, లంబాడీ, ఒగ్గు కళాకారులతో పాటు గీత కార్మికులు, కరాటే బృందాలు, ఎన్‌సీసీ విద్యార్థులు తదితరులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని మెదక్ సంస్కృతి, కళా వైభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా మెదక్ ఖిల్లా సందర్శకుల కోసం టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగానికి సంబంధించిన ఏవీని ప్రదర్శించారు. శాంతికి ప్రతీకగా ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజులు తెల్లటి పావురాలను ఎగురవేశారు. అనంతరం మెదక్ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్‌కు ఉందని అన్నారు. మెదక్‌లోని చారిత్రక, ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గ, మెదక్ చర్చి తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. మెదక్ జిల్లాను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని పరిరక్షించాలని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వినియోగించాలని సూచించారు. మెదక్ పర్యాటక ప్రాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాకు గొప్ప చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపద ఉందన్నారు. ఈ సంపదను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు 14 ప్రాంతాలను గుర్తించామని, వాటికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలను పరిరక్షించడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ మెదక్‌లో అపారమైన వారసత్వ సంపద ఉండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో మెదక్‌ను సందర్శించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థులు చదివిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీపీఆర్‌వో రామచంద్రరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!