A2న్యూస్, జులై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
సిద్దిపేట జిల్లా (24) వివిధ రకాల దివ్యాంగుల సహాయక పరికరాలు, బ్యాటరీ వాహనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగులు సోమవారం ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలంగాణ దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, కొంతమంది అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఒకే వ్యక్తికి రెండు వాహనాలు మంజూరు చేసినట్లు తమ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి పారదర్శకతతో అధికారులు నిజానిజాలను వెల్లడించాలని ఆయన కోరారు. వాహనాల కేటాయింపులో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై స్పష్టత ఇవ్వాలని, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాబట్టి, ఆన్‌లైన్‌లో వాహనాలు లేదా ఇతర సహాయక పరికరాల కోసం దరఖాస్తు చేసుకుని ఇప్పటివరకు ప్రయోజనం పొందని అర్హులైన దివ్యాంగులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కెమ్మసారం అశోక్ విజ్ఞప్తి చేశారు.

