ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉమాదేవికి ఎస్పీ అభినందనలు
విద్యార్థినులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:
చిట్కూల్ (5) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్కూల్ కేజీబీవీలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు సాధించే విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, మార్గదర్శకత్వం ఎంతో ఉంటుందని అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఉమాదేవిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యారంగానికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం విద్యార్థినులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. బాలికలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను నిర్భయంగా పోలీసు అక్క దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని విద్యార్థినులకు హితవు పలికారు.
విద్యార్థినుల విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎంఈఓ, పాఠశాల అధ్యాపకులు, సీఐలు సందీప్‌రెడ్డి, రంగాకృష్ణ, ఎస్ఐ నర్సింలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

