పాపన్నపేటలో ఐ జి ఎల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.. మూడు గ్రామాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 3:
మెదక్ జిల్లా (2) ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు బుధవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పాపన్నపేట మండలం అరికెల గ్రామంలో ఐజిఎల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన.. తాగునీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అదేవిధంగా అరికెల, నాగ్సన్‌పల్లి, నర్సింగ్రావుపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎం ఎస్ ఎస్ ఓ ఆధ్వర్యంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా నిరంతరం చర్యలు చేపడతామని తెలిపారు.
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు
పాపన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మెదక్ పట్టణంలోని హెచ్ కన్వెన్షన్‌లో మెదక్ మండలానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
హవేలీ ఘన్‌పూర్ మండలంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలోనూ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
నూతన వధూవరులకు శుభాకాంక్షలు
పర్యటనలో భాగంగా నాగ్సన్‌పల్లి గ్రామ సర్పంచ్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని అన్నారు. తాగునీరు, రేషన్ వంటి ప్రాథమిక అవసరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

