Monday, September 14, 2026
Homeమెదక్నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై సమీక్ష

నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై సమీక్ష

📰 Generate e-Paper Clip

రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలి: డిసిహెచ్ శివదయాల్

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 2:

నర్సాపూర్ (1) నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని అధికారులు సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మాతృత్వ, చిన్నపిల్లల వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అంటువ్యాధులు కాని వ్యాధుల (ఎన్ సి డి) సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిహెచ్ శివదయాల్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అవసరమైన పరీక్షలు, చికిత్సలు, ఇతర ఆరోగ్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన ఆయన.. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరితో సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఎన్ సి డి సేవలపై ప్రత్యేక దృష్టి

మధుమేహం, అధిక రక్తపోటు వంటి అంటువ్యాధులు కాని వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం, ఫాలోఅప్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యత, డైట్ సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని, ఆసుపత్రి ప్రాంగణం, వార్డుల్లో నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.

తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలి

విధులు నిర్వహించే సమయంలో అన్ని స్థాయిల ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు (ఐడి కార్డు) ధరించాలని డిసిహెచ్ శివదయాల్ స్పష్టం చేశారు. దీనివల్ల రోగులు, వారి సహాయకులు సిబ్బందిని సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు సంబంధించి హెచ్ ఓ డి లు, ఫ్యాకల్టీ వారీగా బాధ్యతలను స్పష్టంగా కేటాయించి, ప్రతి విభాగం పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!