టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏడుపాయలు, మెదక్ ఖిల్లా, సీఎస్ఐ కేథడ్రల్ సందర్శన
A2న్యూస్, జులై 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (18) మెదక్ జిల్లా పురాతన, చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమని మా అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు, హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత మంచు విష్ణు అన్నారు.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. ఏడుపాయలకు చేరుకున్న మంచు విష్ణుకు అదనపు కలెక్టర్ నగేష్ మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచు విష్ణుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, ప్రాముఖ్యతను అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. అనంతరం చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ ఖిల్లాను సందర్శించిన ఆయన, దాని చరిత్ర గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ, మన చరిత్ర గురించి పుస్తకాల్లో చదివామని, ఎంతో విన్నామని, కానీ ప్రత్యక్షంగా చూసింది చాలా తక్కువేనని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికీ లేని గొప్ప చారిత్రక వారసత్వం మన దేశానికి ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడం అభినందనీయమన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు ఎన్నో చారిత్రక కట్టడాలు మెదక్ జిల్లాలో ఉన్నాయని, హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలను సందర్శించకపోవడం బాధాకరమన్నారు. మన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాను నటించే లేదా నిర్మించే సినిమాల్లో మెదక్ జిల్లాలో చిత్రీకరణకు అవకాశం కల్పిస్తానని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, డీఎస్పీ ప్రసన్న కుమార్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

