A2 న్యూస్, జూన్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట, జూన్ 22: మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చేగుంటలోని గీతా స్కూల్‌లో సోమవారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు మంచి అలవాట్లపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గీతా స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని మత్తు పదార్థాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని ప్రతిజ్ఞ చేశారు.

