A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18:
మెదక్ జిల్లా (17) పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి, భూగర్భ గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో రూ.3.25 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని, చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో రూ.3.25 లక్షలతో నిర్మించిన కేజీబీవీ భవనాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం కేజీబీవీ విద్యార్థినులతో మంత్రి సమావేశమై పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికల విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం కేజీబీవీల్లో అనేక మౌలిక వసతులు కల్పిస్తూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థినులకు మరిన్ని సౌకర్యాలు అవసరమైతే వాటిని మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారు భవిష్యత్తులో స్వయం సమృద్ధిగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పేదల పక్షపాతిగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కేజీబీవీల్లో అవసరమైన వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలు
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని మెదక్ జిల్లాతో పాటు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కేజీబీవీలపై నిరంతర పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ కేజీబీవీల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ కార్యక్రమాలు పూర్తవడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశంపై ఏపీసీలు, కోఆర్డినేటర్లు, డీఈఓ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కేజీబీవీ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

