Monday, September 14, 2026
Homeమెదక్డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

📰 Generate e-Paper Clip

ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న రైతును అభినందించిన కలెక్టర్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 21:

హవేలీ ఘనపూర్ (20) డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువ కలిగిన ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో రైతు దొమ్మట జైపాల్ రెడ్డి ఒక ఎకరంలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను గురువారం కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట సాగు విధానం, మొక్కల పెరుగుదల, పూత, దిగుబడి, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలపై రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సబ్సిడీ, దాని ద్వారా పొందిన ప్రయోజనాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల కత్తిరింపు విధానం, మొక్కల పెరుగుదలను నియంత్రించే పద్ధతులు, కలుపు నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను పరిశీలించి, నీటి వినియోగం, మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందించే విధానాన్ని తెలుసుకున్నారు. పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కాయలు కోతకు వస్తాయి, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధరలు ఎలా ఉన్నాయి వంటి అంశాలపై కూడా రైతుతో చర్చించారు. ఆర్గానిక్ పద్ధతిలో ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తున్న రైతు జైపాల్ రెడ్డి అనుభవాలను కలెక్టర్ ఆసక్తిగా తెలుసుకుని అభినందించారు. తక్కువ నీటితో సాగు చేయగల, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న అధిక విలువ కలిగిన ఉద్యాన, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. సాగులో డ్రిప్ ఇరిగేషన్‌, సేంద్రియ పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్య విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్‌తో పాటు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!