అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిరంతర పర్యవేక్షణ
తూప్రాన్ టోల్గేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9:
తూప్రాన్ (8) జాతీయ రహదారి–44పై రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం తూప్రాన్ టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నిఘా, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) పనితీరును పరిశీలించారు. ఎన్‌హెచ్–44పై వాహనాల రాకపోకలను 24 గంటలూ నిరంతరం పర్యవేక్షించాలని ఐజీ సూచించారు. అతివేగం, రాంగ్ లేన్‌లో ప్రయాణించడం, వ్యతిరేక దిశలో వాహనాల రాకపోకలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలు, ట్రిపుల్ రైడింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి, సంబంధిత పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని ఏటీఎం ఎస్ వ్యవస్థలో భాగంగా ఉన్న ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలు, వాహనాల వేగాన్ని గుర్తించే వి ఏ ఎస్ డి రాడార్ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలు, వేరియబుల్ మెసేజింగ్ సైన్ బోర్డుల పనితీరును ఐజీ పరిశీలించారు. రహదారిపై ప్రమాదాలు, నిలిచిపోయిన వాహనాలు, అడ్డంకులు, పాదచారుల రాకపోకలు వంటి ఘటనలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే స్పందించేలా సాంకేతిక వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి ఈ-చలాన్ ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు గుర్తించిన వెంటనే పోలీసు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం చేరేలా సమన్వయం ఉండాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలూ నిఘా కొనసాగించాలని, సీసీ కెమెరాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఇతర సాంకేతిక పరికరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఐజీ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, నేరాలను అరికట్టడం, అత్యవసర సేవలను వేగంగా అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ తనిఖీలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎస్ఐ గంగా రాజుతో పాటు టోల్గేట్ సిబ్బంది పాల్గొన్నారు.

