A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:11 am Posted by : A2TV NEWS

తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్‌

వ్యసనాలకు బానిసైతే భవిష్యత్‌ అంధకారమే

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం

మాబోజిపల్లి గీత హైస్కూల్‌లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ 25: తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాల బారిన పడితే జీవితాన్నే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, విద్యార్థులను హెచ్చరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మెదక్ మండలం మాబోజిపల్లి గీత హైస్కూల్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థి దశలో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును నిర్దేశిస్తుందని అన్నారు. తాత్కాలిక ఆనందం, చెడు స్నేహాలు లేదా కుతూహలం కోసం మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు.ప్రస్తుతం కొందరు యువత డ్రగ్స్‌తో పాటు పెట్రోల్ వాసన పీల్చడం, వైట్నర్, నెయిల్ పాలిష్ వంటి రసాయన పదార్థాలను దుర్వినియోగం చేస్తూ కొత్త రకాల వ్యసనాలకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అలవాట్లు మెదడు, గుండె, ఊపిరితిత్తులు తదితర కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు మహిళలు కల్లు వంటి మత్తు పానీయాలకు అలవాటు పడటం వల్ల గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. వ్యసనాలకు గురైన వారిని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సహకరించాలని సూచించారు.డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయి చట్టవిరుద్ధ కార్యకలాపాల వైపు మళ్లే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో జరిగిన కొన్ని సంచలనాత్మక నేరాలను ఉదాహరణగా పేర్కొంటూ మత్తు పదార్థాల దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వ్యసనం వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మద్దతుగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా మహిళా & శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ), డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌వో), జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, గీత హైస్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.