విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి: సీఎస్ సంజయ్ జాజు
దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించాలి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 29:
మెదక్ జిల్లా (28)రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, వారి భద్రత, ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, హాజరు, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి సీఎస్ సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్షించారు. మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కలెక్టర్లు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఆహార విషబాధ, ఎలుకలు, పాము కాటు వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వంటశాలలు, ఆహార నిల్వ గదులు, పాత్రలు, పరిసరాల పరిశుభ్రతను ప్రతిరోజూ తనిఖీ చేయాలని సూచించారు. వంటశాలల ఆధునికీకరణకు అవకాశం ఉన్న చోట పనులను వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని, సిబ్బంది సమయపాలన, విధుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యాసంస్థకు నోడల్ అధికారిని నియమించి విద్యార్థుల హాజరు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత తదితర అంశాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
శీతాకాలానికి ముందస్తు ఏర్పాట్లు
రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు, అవసరమైన దుప్పట్లు ముందుగానే అందుబాటులో ఉంచాలని సీఎస్ సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న విద్యాసంస్థల భవన యజమానులతో సమావేశమై అవసరమైన మరమ్మతులు, మార్పులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దసరా నాటికి రెండు జతల యూనిఫాంలు
ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎస్.. దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన ఏకరూప దుస్తులు అందేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నవీకరించాలని సీఎస్ ఆదేశించారు. డ్యాష్బోర్డ్ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత
బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారిని తప్పనిసరిగా నోడల్ అధికారిగా నియమించి విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత సమస్యలు, కౌన్సెలింగ్ తదితర అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఒత్తిడి, భావోద్వేగ సమస్యలను గుర్తించి అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరిగా నమోదు కావాలని ఆదేశించారు. విద్యాసంస్థలను ప్రతిరోజూ తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, తనిఖీల సందర్భంగా వంటగది పరిశుభ్రత, తాగునీటి నాణ్యత, మరుగుదొడ్లు, తరగతి గదులు, హాస్టల్ గదుల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ముడి సరుకుల నాణ్యత, ఆహార తయారీ విధానం, భోజనం వడ్డించే సమయంలో పాటిస్తున్న పరిశుభ్రతను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించి విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజు, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి సింధు, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, సంబంధిత గురుకులాల ఆర్సీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

