3½ ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు –10 వేల జరిమానా, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (14) మూడుున్నరేళ్ల పసి బాలికపై జరిగిన అమానుష లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే బాధిత చిన్నారికి రూ.5 లక్షల విక్టిమ్ కాంపెన్సేషన్ మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలకల్ గ్రామంలో 2025 మార్చి 10న ఈ దారుణ ఘటన జరిగింది. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన 3½ ఏళ్ల చిన్నారి కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది. అంగన్‌వాడీ టీచర్ సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, బీహార్ రాష్ట్రానికి చెందిన తున్న కుమార్ (20) చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. గ్రామ శివారులోని చెరువు కట్ట సమీపంలో చిన్నారి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన నిందితుడు పరారయ్యాడు. తీవ్ర భయాందోళనలో ఉన్న చిన్నారిని వెంటనే రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేశారు. తూప్రాన్ డీఎస్పీలు వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, శాస్త్రీయ ఆధారాలు, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలతో పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత చిన్నారి మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధం చేశారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావాలి నిందితుడు తున్న కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే బాధిత చిన్నారికి రూ.5 లక్షల విక్టిమ్ కాంపెన్సేషన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో మహిపాల్ రెడ్డి సమన్వయంతో పనిచేశారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య, దర్యాప్తు అధికారులు, భరోసా బృందం, లైజనింగ్ ఆఫీసర్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి నేరస్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ప్రతి చిన్నారి భద్రత సమాజం, తల్లిదండ్రులు, పోలీసు వ్యవస్థల ఉమ్మడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు

