బాధితులకు సత్వర న్యాయం అందించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18:
మెదక్ జిల్లా (17) ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా, వినతిదారులకు వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని అదనపు ఎస్పీ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం, నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హామీ ఇచ్చారు.

