Thursday, July 30, 2026
Homeమెదక్సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు

సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

5 వేల జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (29) శివంపేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన నిందితుడు వడ్డే రాములు (33)కు జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు 5,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ వివరాల ప్రకారం, కొమ్మిరే నర్సమ్మ అలియాస్ రేణుక (30) భర్తతో విడిపోయి సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీలో తన తల్లిదండ్రులు, కుమారుడితో కలిసి నివసిస్తూ కూలీ పనులు చేసుకునేది. గత ఏడాది కాలంగా హత్నూర మండలం పాల్పనూరు గ్రామానికి చెందిన వడ్డే రాములుతో సంగారెడ్డిలో అద్దె గదిలో సహజీవనం చేస్తోంది. కుటుంబ అవసరాల కోసం రేణుక తరచూ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు 2023 ఆగస్టు 23న రేణుకను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె చీరతో గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరుసటి రోజు చిన్న గోటిముక్కుల గ్రామ శివారులోని చకరిమెట్ల గుడి సమీప అటవీ ప్రాంతంలో రేణుక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఫిర్యాదు మేరకు శివంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి దర్యాప్తు అధికారి సీఐ శ్రీధర్ సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి ఛార్జిషీట్ దాఖలు చేయగా, ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజా గౌడ్ విచారణలో సాక్షులను సమర్థంగా ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించడంతో, పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో శివంపేట్ ఎస్‌ఐ మధుకర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, శివంపేట్ సీడీఓ ఆనంద్ తదితరులు సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రజా అభియోజకులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, శాస్త్రీయ దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో బాధితులకు న్యాయం జరిగేలా మెదక్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!