A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 17:
మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించేందుకు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ పథకం కింద నీటి గుంతలు, ఫామ్ పాండ్స్ (వ్యవసాయ నీటి కుంటలు), వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు, ఇంకుడు గుంతలను నిర్మించడం ద్వారా వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి వినియోగించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఫామ్ పాండ్స్ నిర్మాణం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు సహజ వనరుల సంరక్షణకు కూడా దోహదపడవచ్చని అన్నారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపుపై రైతులు, గ్రామీణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

