ఐలమ్మ ధైర్యం.. నేటి తరానికి స్ఫూర్తి
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27:
మెదక్ జిల్లా (26) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం, హక్కుల కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఐలమ్మ జీవితం, పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం, మహిళల గౌరవం, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సూచించారు. యువత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు సందీప్‌రెడ్డి, శైలేందర్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

