ఆధునిక సాంకేతికతతో భద్రతను మరింత బలోపేతం చేయాలి
ఎస్బీఐ అధికారులతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సమావేశం
A2న్యూస్, మెదక్ జిల్లా/తూప్రాన్ ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24:
తూప్రాన్(23) ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద చోటుచేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో ఏటీఎంల భద్రతను మరింత పటిష్టం చేయాలని తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం తూప్రాన్లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఏటీఎం విభాగం అధికారులతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై బ్యాంకు అధికారులతో డీఎస్పీ చర్చించారు. పాత తరహా ఏటీఎం యంత్రాలను తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఏటీఎం కేంద్రంలో 24 గంటల పాటు భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఏటీఎం కేంద్రాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. అత్యవసర భద్రతా వ్యవస్థ (ఈఎస్ఎస్)ను ఏర్పాటు చేసి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలను నిర్దిష్ట కాలవ్యవధి వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఏటీఎం కేంద్రాల్లో భద్రతా లోపాలు గుర్తించిన వెంటనే వాటిని పరిష్కరించాలని, అవసరమైన సందర్భాల్లో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. ఏటీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బ్యాంకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రామాయంపేట సీఐ సైదా, డీసీఆర్బీ సీఐ జార్జ్, ఎస్బీఐ ఏటీఎం విభాగం జీఎం రాజేష్ ప్రసాద్, ఫీల్డ్ ఆఫీసర్ జయప్రసాద్, ఏటీఎం భద్రతా ఇన్చార్జి ఆనంద్ రాజ్, ఆర్ఎం మారుతి, డీజీఎం భువనేశ్వరి, ఏటీఎం నగదు ఇన్చార్జి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

