Friday, September 18, 2026
Homeమెదక్వామ్మో రోడ్లు..! బాగు చేసేది ఎప్పుడు..?

వామ్మో రోడ్లు..! బాగు చేసేది ఎప్పుడు..?

📰 Generate e-Paper Clip

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా..?

— గుంతలమయంగా మారిన ప్రధాన

రహదారి.. వాహనదారుల ఆందోళన

A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18:

చేగుంట (17) చేగుంట మండలం నుంచి కర్ణంపల్లి మీదుగా గజ్వేల్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోనాల వెళ్లే డబుల్‌ రోడ్డు వర్షాల కారణంగా కల్వర్టుల వద్ద పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డంతా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు నరకప్రాయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రహదారిపై పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడినట్లు వాహనదారులు, వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పలు కంపెనీలకు అనుసంధానంగా ఉండి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి మరమత్తులను పట్టించుకునే నాదులే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని పలు కంపెనీల నుంచి ప్రతి ఏటా లక్షలాది రూపాయలు వివిధ రూపాల్లో పన్నులుగా వస్తున్నప్పటికీ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. రోడ్డు దుస్థితిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులు వెంటనే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు కళ్లుతెరిచి, మరో ప్రమాదం జరగకముందే గుంతలను పూడ్చి రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని స్థానిక వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!