జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ పరితోష్ పంకజ్
A2న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18:
సంగారెడ్డి జిల్లా 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని, అనంతరం అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతం కావడంతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని వివరించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన అంటే ప్రజలచేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికీ చేరవేయడమే ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తొలి రోజున సమాజానికి సేవ చేయాలనే ఉత్సాహంతో విధుల్లో చేరినట్లుగానే, చివరి వరకు అదే సేవాభావాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సేవాభావం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రజాపాలన దినోత్సవం మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, రామకృష్ణ రెడ్డి, రామునాయుడు, నగేష్, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, ఎస్బీ, డీసీఆర్బీ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

