జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 15 :
మెదక్ జిల్లా (14) పోలీస్ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి నెలకొనాలని కోరుకున్నారు. మెదక్ జిల్లాలో ప్రజలు పరస్పర సోదరభావం, ఐక్యతతో పండుగలను నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు, యువత పోలీస్ శాఖ సూచనలను పాటిస్తూ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ సూచించారు. భక్తిశ్రద్ధలతో, సామరస్యపూర్వక వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

