అక్టోబర్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం కావాలి
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:
మెదక్ జిల్లా ( 8) వానాకాలం ధాన్యం సీజన్–2026ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోలు, నిల్వ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం దిగుబడికి అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి పరిశీలించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు తదితర ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పాటు రైతులకు సులభంగా చేరుకునే విధంగా స్థలాల ఎంపికపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు తూకం యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం నాణ్యత పరీక్షించే పరికరాలు తదితరాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ అంబాదాస్ రాజేశ్వర్, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఇన్‌చార్జి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాద్‌రావు, సివిల్ సప్లై అధికారులు నిత్యానంద, జగదీష్, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, డీసీఓ పద్మతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

