క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మెదక్ సీఐ మహేష్
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.. ఉత్సాహంగా 5కే, 2కే రన్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 :
మెదక్ జిల్లా (29) రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్నింగ్ పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం శుభపరిణామమన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు చౌరస్తా నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్, కొత్త బస్టాండ్ నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు బాలికలకు 2 కిలోమీటర్ల రన్నింగ్ నిర్వహించారు. విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన సీఐ మహేష్
- 5 కిలోమీటర్ల రన్నింగ్‌లో స్వయంగా పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన మెదక్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ క్రీడాకారులు, క్రీడాభిమానుల్లో స్ఫూర్తిని నింపారు. పోలీసు అధికారి హోదాలో ఉండి యువతతో కలిసి పరుగులో పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాల్గొనడంతో క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
అనంతరం ధ్యాన్‌చంద్ చౌరస్తా వద్ద మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ అహ్మద్, స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శివ, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, సమష్టి తత్వాన్ని పెంపొందించడమే రన్నింగ్ పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు, మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమైక్య కార్యదర్శి నాగరాజు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆనందం, ఫుట్‌బాల్ కోచ్ వినయ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

