అధికారులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:
మెదక్ జిల్లా (7)ఈ నెల 15న నిర్వహించనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో శుక్రవారం మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్, డయాస్‌ను పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పూల అలంకరణతో అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులకు అనువుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా స్టాళ్లు, శకటాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించేలా ప్రగతి సందేశాన్ని సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళిక అధికారికి సూచించారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని మెదక్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. జాతీయ భావాన్ని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
పకడ్బందీ బందోబస్తు
జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్, బారికేడ్లు, బందోబస్తు తదితర ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

