Saturday, August 8, 2026
Homeమెదక్కుచారంలో సీసీ కెమెరాల నిఘా

కుచారంలో సీసీ కెమెరాల నిఘా

📰 Generate e-Paper Clip

18 సీసీ కెమెరాలు, 2 ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ప్రారంభం

నేరాల నియంత్రణ, వాహనాల కదలికలపై నిరంతర నిఘా

ఐటీసీ సహకారంతో భద్రతా వ్యవస్థ బలోపేతం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8:

మెదక్ జిల్లా (7) (కూచారం )నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. ఐటీసీ కంపెనీ సహకారంతో కుచారం గ్రామం, బంగారమ్మ టెంపుల్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలు, 2 ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుచారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామంలోకి వచ్చే, బయటకు వెళ్లే వాహనాల రాకపోకలపై నిరంతరం నిఘా ఉంచేందుకు కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు, దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు దోహదపడతాయన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను పర్యవేక్షించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తు నిరోధక చర్యలు చేపట్టడంలోనూ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు.

ఏఎన్‌పీఆర్‌ కెమెరాలతో వాహనాల నంబర్‌ ప్లేట్ల గుర్తింపు

ఏఎన్‌పీఆర్‌ కెమెరాల ద్వారా వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న లేదా నేరాలకు సంబంధం ఉన్న వాహనాలను గుర్తించడంలో ఈ సాంకేతికత పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే 1908కు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులకు వెల్లడించవద్దని, గుర్తుతెలియని లింకులను తెరవవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరమని, మరిన్ని ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు, సంస్థలు ముందుకు రావాలని ఎస్పీ కోరారు. కుచారం, బంగారమ్మ టెంపుల్‌ పరిసరాల్లో కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఐటీసీ కంపెనీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌, సీఐలు వెంకట రాజా గౌడ్‌, సందీప్‌ రెడ్డి, మనోహరాబాద్‌ ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు, ఐటీసీ మేనేజర్‌ ఆనంద్‌, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!