Tuesday, September 15, 2026
Homeమెదక్నిర్దేశిత గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి

నిర్దేశిత గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

ఆర్డీవోలు, తహసీల్దారులతో గూగుల్ మీట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష

A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (10) పారదర్శక  ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ పురోగతిపై ఆర్డీవోలు, తహసీల్దారులతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ఇప్పటివరకు ఎన్ని శాతం ప్రక్రియ పూర్తయిందో, ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయా, తిరిగి ఎంత మేరకు ఫారాలు స్వీకరించారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం చేరేలా చర్యలు తీసుకుని, నిర్ణీత గడువులోపు వారు ఫారాలు సమర్పించేలా చూడాలని ఆదేశించారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే కుటుంబ సభ్యుల సంతకంతో ఫారాలు స్వీకరించాలని సూచించారు.ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణతో పాటు వివరాల డిజిటలైజేషన్‌ను సమాంతరంగా నిర్వహించాలని, ఓటర్లు నమోదు చేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో సహకారం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ వద్ద తాజా ఓటరు జాబితా తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డబుల్ ఓట్లు కలిగిన వారిని గుర్తించి ఓటరు జాబితాలో గుర్తింపులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా బీఎల్ఓలకు సహకరించాలని ఆమె కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, ఎన్నికల సూపరింటెండెంట్ గఫార్, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!