A2న్యూస్, జులై 11, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
నర్సాపూర్ (10) గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ సర్పంచ్ లకు సూచించారు. శుక్రవారం బీవీఆర్‌ఐటీ కళాశాలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం తోపాటు చెట్లను కూడా సంరక్షించాలని తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ గ్రామాల లక్ష్య సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ఎన్. యాదయ్య, సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాస్ రావు లు మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ, చెత్త వర్గీకరణ, కంపోస్టింగ్ విధానాలు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు వివరించారు. అనంతరం జలసిరిపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారులు సాయిబాబా, సురేష్ బాబు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

