Monday, September 14, 2026
Homeమెదక్ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు

ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను సరిచూసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27:

మెదక్ జిల్లా (26) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ సభల్లో సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపించడంతో పాటు, ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునే అవకాశం కల్పించనున్నారు. అర్హులైన పౌరులు కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు నమూనా–6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం నమూనా–7, వివరాల సవరణ కోసం నమూనా–8ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆచూకీ లేని, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన, రెండు చోట్ల నమోదైన ఓటర్ల వివరాలను కూడా గ్రామ, వార్డు సభల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. జాబితాల్లో తప్పులు గుర్తించిన వారు తగిన ఆధారాలతో సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అసంగత వివరాలు ఉన్న, గత ఓటరు జాబితాతో అనుసంధానం కాని ఓటర్ల వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా అందుబాటులో ఉంచి ప్రక్రియలో పారదర్శకత పాటించనున్నట్లు వెల్లడించారు. అసంగత వివరాలు ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి ద్వారా ఓటరుకు లేదా కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేస్తారని, అందులో పేర్కొన్న తేదీ, సమయం, ప్రదేశంలో స్వయంగా హాజరై అవసరమైన అసలు ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు సమీప గ్రామ పంచాయతీ భవనం లేదా వార్డు కార్యాలయంలో విచారణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారి ఎదుట ధ్రువపత్రాలతో హాజరుకావచ్చని, భారత ఎన్నికల సంఘం ఓటర్ల సేవల అంతర్జాల వేదిక ద్వారా కూడా సంబంధిత పత్రాలను ముందుగానే జతచేయవచ్చని తెలిపారు. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 1987 జూలై 1కి ముందు జన్మించిన వారు ఎన్నికల సంఘం గుర్తించిన ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమ ధ్రువపత్రంతో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి అందజేయాలి. 2004 డిసెంబర్ 2 తరువాత జన్మించిన వారు తమ ధ్రువపత్రంతో పాటు తల్లిదండ్రులిద్దరి ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. శాశ్వత నివాస, అటవీ హక్కులు, కుల, జనన ధ్రువపత్రాలు, కుటుంబ నమోదుపత్రం, ప్రభుత్వ భూమి లేదా గృహ కేటాయింపు పత్రం, ఆధార్, పాస్‌పోర్టు, పదో తరగతి లేదా ఇతర విద్యార్హత పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, పింఛను చెల్లింపు ఆదేశ పత్రం, జాతీయ పౌరుల నమోదుపత్రంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, జీవిత బీమా సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. 2002 ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాతో వివరాలు సక్రమంగా అనుసంధానమైన ఓటర్లు అదనపు ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆగస్టు 10లోగా గణన పత్రాన్ని సమర్పించని వారు దావాలు, అభ్యంతరాల స్వీకరణ సమయంలో నమూనా–6తో పాటు నిర్ణీత ప్రకటన పత్రాన్ని అందజేయవచ్చని తెలిపారు. ప్రజలు ఆగస్టు 27న నిర్వహించే గ్రామ, వార్డు సభలను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. పేరు నమోదు కాకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా సవరణకు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించడంతో పాటు 1950 ఉచిత సహాయ సంఖ్యను వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!