A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:
మెదక్ జిల్లా (31)నిరుపేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వార్డులు, వంటగది, భోజనశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే వైద్యుల హాజరు నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల వైద్యులు విధుల్లో అందుబాటులో ఉండి రోగులకు సకాలంలో సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్ డాక్టర్ నితిన్ కాబ్రా, శాఖాధిపతి డాక్టర్ రవీంద్ర కుమార్, రేడియాలజిస్ట్ డాక్టర్ శారదా దేవి, ఆర్‌ఎంఓ శైలజతో పాటు శ్రీవిద్య, ప్రియాంక, నిర్మల, వంశీ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.