రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా మెదక్‌లో రన్ ఫర్ యూనిటీ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 31:
మెదక్: దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా పాల్గొన్నారు.
బోధన్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు రన్ కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పటేల్ 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని భాష, మతం, ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంతో మెలగాలని, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సోదరభావంతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఎస్పీ రంగనాథ్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్సైలు, అగ్నివీర్ అభ్యర్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

