Thursday, October 15, 2026
Homeమెదక్హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

కుటుంబ కలహాలతో భర్త హత్య.. భార్య, ఆమె తండ్రికి జైలుశిక్ష

5 వేల చొప్పున జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 29:

మెదక్ జిల్లా (28) కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేష్‌ను హత్య చేసిన కేసులో నిందితులైన అతని భార్య విజయ, ఆమె తండ్రి నర్సింలుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఘనపూర్‌కు చెందిన దొడ్ల వెంకటేష్ (38) భార్య విజయ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముండేవాడు. కుటుంబ విషయాల్లో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. 2023 సెప్టెంబర్ 1న రాఖీ పండుగ సందర్భంగా విజయ తండ్రి నర్సింలు, ఇతర బంధువులతో కలిసి వెంకటేష్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటలకు వెంకటేష్‌ను కొబ్బరి తాళ్లు, చున్నీతో కట్టేసి దాడి చేయడంతో పాటు వేడి నీళ్లు పోసి గదిలో బంధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని విజయ ఫోన్ ద్వారా వెంకటేష్ తమ్ముడికి తెలియజేయడంతో రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఘనపూర్‌కు చేరుకుని గది తాళం పగలగొట్టి వెంకటేష్‌ను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. వెంకటేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి తూప్రాన్ ఎస్‌ఐ శివానందం కేసు నమోదు చేశారు. అప్పటి తూప్రాన్ సీఐ, దర్యాప్తు అధికారి శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్, ఎస్‌ఐ గంగరాజు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ.. నిందితులు విజయ, నర్సింలుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

పోలీసు అధికారులకు అదనపు ఎస్పీ అభినందనలు

నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ అభినందించారు. నేరాలకు పాల్పడిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విట్టల్, కానిస్టేబుల్ రవీందర్‌గౌడ్, సీడీఓ నాగరాజు సహకరించినట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!