మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. డీజేలకు అనుమతి లేదు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 13:
మెదక్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మెదక్ టౌన్, మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్యం, నిమజ్జనం తదితర అంశాలపై పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రజలంతా సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపాన్ని పోలీసు శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని అనుమతి పొందాలని తెలిపారు. విగ్రహం ఎత్తు, మండపం ఏర్పాటు ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. మండపాల వద్ద 24 గంటలూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. మండపాల వద్ద టపాకాయలు కాల్చరాదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని.. మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా అవసరమైన ప్రాంతాల్లో బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, సందీప్‌రెడ్డి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

