9వ జాతీయ పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10:
మెదక్ జిల్లా (9) మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మనం అంగన్వాడీ.. మన బాధ్యత” అనే నినాదంతో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజల్లో పోషకాహారం, మాతా-శిశు ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఈఓ రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

