టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా లోగో, బ్రాండింగ్ ఏర్పాటు
7 కోట్లతో ఏడుపాయలలో 12 కాటేజీల నిర్మాణానికి చర్యలు
స్వదేశీ దర్శన్‌లో రూ.100 కోట్ల నిధులపై ఆశలు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 :
మెదక్ జిల్లా (25) మెదక్ జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి హెరిటేజ్ టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన తొలి విడత టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించిన 10 ఎజెండా అంశాలపై అధికారులతో చర్చించారు. ఏడుపాయల వనదుర్గ భవానీ దేవాలయ ఆవరణలో రూ.7 కోట్లతో 12 కాటేజీల నిర్మాణానికి స్థల సేకరణ ప్రక్రియను టూరిజం శాఖ పూర్తి చేసిందని కలెక్టర్ తెలిపారు. నిర్మాణ బాధ్యతలను టూరిజం, జిల్లా పంచాయతీ శాఖలకు అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మెదక్ కోట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
మెదక్ కోట అభివృద్ధిలో భాగంగా సెక్యూరిటీ గార్డుల నియామకం, టూరిస్ట్ గైడ్లు, హౌస్ కీపింగ్, సందర్శకుల టికెట్లు, పార్కింగ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనంలోకి తీసుకుని పరిరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రక్షణ కంచె ఏర్పాటు చేసి కోట పరిసరాల్లో పార్కింగ్‌ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ బాధ్యతలను మెదక్ మున్సిపల్ కమిషనర్ చేపట్టాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. మెదక్ కోటను సందర్శించే యాత్రికుల కోసం రాష్ట్రస్థాయి హెరిటేజ్ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5 టికెట్ ధర నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. కోటపైకి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.57 లక్షల నిధులతో హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.5 లక్షలతో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మరో రూ.21 లక్షలను మరమ్మతులు, మౌలిక వసతుల కోసం కేటాయించి టెండర్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు
మెదక్ కోట, ఏడుపాయల, పోచారం, వేల్పుగొండ, నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ తదితర ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి సందర్శకులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో మొబైల్ ఫుడ్ వాహనాలను కూడా ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏడుపాయల ఆలయ పరిసరాల్లోని అసైన్డ్ భూములను గుర్తించి, వాటిని ఫుడ్ కోర్టులు, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు వినియోగించే దిశగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
స్వదేశీ దర్శన్‌తో 100 కోట్ల అభివృద్ధి
స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా మెదక్ కోట, పోచారం ప్రాంతాలను ఇటీవల కేంద్ర బృందం సందర్శించిందని కలెక్టర్ తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో మెదక్ జిల్లా పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెంది, సందర్శకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా మెదక్‌కు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శిక్షణ అనంతరం టూరిస్ట్ గైడ్ల నియామకం
టూరిస్ట్ గైడ్ల నియామకానికి జిల్లాకు చెందిన ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం వారు శిక్షణ పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం నిబంధనల ప్రకారం వారిని నియమిస్తామని చెప్పారు. చారిత్రక ప్రదేశాల్లో గైడ్లను అందుబాటులో ఉంచి పర్యాటకులకు ఆయా ప్రాంతాల చరిత్ర, విశిష్టతలను సమగ్రంగా వివరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెక్యూరిటీ గార్డుల నియామకాన్ని ఏజెన్సీల ద్వారా చేపట్టేందుకు మెదక్ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు.
మహిళా సంఘాలతో హోమ్‌స్టేలు
హోమ్‌స్టేలకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాలను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించి తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా టూరిజం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సహాయ సహకారాలు, టూరిజం శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్ సూచనలు, స్వదేశీ దర్శన్‌లో కేంద్ర నిధుల మంజూరుకు ఎంపీ చొరవతో పర్యాటక అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ జోజి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, టూరిజం అధికారి రమేష్, ఈడీఎం సందీప్, డీపీఆర్ఓ రామచంద్రరాజు, మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ సహాయ సంచాలకులు ఓం ప్రకాష్, హెరిటేజ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ డైరెక్టర్ డి.మల్లు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ శ్రీశైలం తదితరులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు.

