A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 23:
మెదక్ జిల్లా (22): దివ్యాంగుల కోసం నిర్వహించనున్న యు డి ఐ డి ప్రత్యేక శిబిరం తేదీలో మార్పు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఆగస్టు 26న శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించామని, అయితే అదే రోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున శిబిరాన్ని ఆగస్టు 25, మంగళవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెదక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ ప్రత్యేక యు డి ఐ డి శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. నూతన చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువు ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికీ యు డి ఐ డి ధ్రువీకరణ పత్రం పొందని దివ్యాంగులు ఆగస్టు 25 సాయంత్రం వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ బుకింగ్ అనంతరం మెదక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరిగే శిబిరంలో యు డి ఐ డి ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యు డి ఐ డి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డి ఆర్ డి ఏ కార్యాలయం లేదా సంబంధిత మండల ఏ పి ఎం ద్వారా శిబిరం నిర్వహణకు సంబంధించిన సమాచారం అందజేస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూతన చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

