రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.. ఓటర్లకు అవగాహన కల్పించాలి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 20:
మెదక్ జిల్లా (19) ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ గఫార్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్లో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాల పరిశీలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మ్యాపింగ్ కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాలను పరిశీలనలో పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించాలని, అక్టోబర్ 15 వరకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేపడుతున్న చర్యలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర స్థాయికి పంపాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సులభంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించి, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. నోటీసుల జారీ నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం వరకు ప్రతి దశను అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని, నిర్ణీత కాలపరిమితిలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ధ్రువపత్రాల స్వీకరణకు సంబంధించిన తేదీ, సమయాలను ముందుగానే ఖరారు చేయాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ గఫార్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

