Monday, September 14, 2026
Homeమెదక్స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

📰 Generate e-Paper Clip

యూనిఫాం అంటే కేవలం ఉద్యోగం కాదు.. బాధ్యత, సేవ

అత్యవసర పరిస్థితుల్లో ముందుగా చేరేది పోలీసులే

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16:

మెదక్ (15) స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. వారి ఆశయాల నుంచి స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధి, ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సమాజంలో ఎలాంటి ఘటన జరిగినా ముందుగా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు రక్షణ, సహాయ సహకారాలు అందించేది పోలీసులేనని అన్నారు. అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది రెస్క్యూ టీమ్‌లా ముందుండి ప్రజలకు అండగా నిలుస్తారని తెలిపారు.

ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం

పోలీసులపై కొందరు ఎందుకు ప్రతికూలంగా మాట్లాడుతున్నారనే అంశంపై అదనపు ఎస్పీ స్పందిస్తూ.. సమాజంలో పోలీసుల పాత్ర ‘స్ట్రిక్ట్ పేరెంట్స్‌’ లాంటిదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లే పోలీసులు కూడా ప్రజల భద్రత, రక్షణకే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్ చేయకుండా నిరోధించడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకుండా చూడటం, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవడం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు కూడా తల్లిదండ్రుల మాదిరిగానే ముందస్తు చర్యలు తీసుకుంటారని, అందువల్ల కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. పోలీసుల కఠినత్వం వెనుక ఎల్లప్పుడూ ప్రజల భద్రత, సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. “పోలీసు యూనిఫాం అంటే కేవలం ఉద్యోగం కాదు.. అది బాధ్యత, సేవ. ప్రజలకు, సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత” అని అదనపు ఎస్పీ అన్నారు.

మారుతున్న నేరాలపై అప్రమత్తత

సమాజంలో నేరాల స్వభావం వేగంగా మారుతోందని విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. గతంలో వామపక్ష తీవ్రవాదం వంటి సవాళ్లు ప్రధానంగా ఉండగా.. ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆహార కల్తీ వంటి కొత్త తరహా నేరాలు సమాజానికి సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. మారుతున్న నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు, సైబర్ మోసాలు లేదా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అదనపు ఎస్పీ సూచించారు. నేరాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్రబోస్, ఇన్‌స్పెక్టర్లు మహేష్, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!