ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్14:
మెదక్ జిల్లా (13) రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆగస్టు 15న ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించడంతో పాటు జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సమగ్రంగా వివరించేలా ముఖ్య అతిథి ప్రసంగ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువతతో పాటు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.

