A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28:
మెదక్ జిల్లా (27) జిల్లా కేంద్రం, సోమవారం: ప్రతి పౌరుడు తమ ఆధార్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుని అవసరమైన సవరణలు, నవీకరణలు తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ-డిస్ట్రిక్ట్ అధికారులు, ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ఆధార్‌లో పేరు, జన్మతేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ (ఉన్నట్లయితే), బయోమెట్రిక్ వివరాలు తదితర సమాచారం ఖచ్చితంగా, తాజా వివరాలతో ఉండాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఆరోగ్య సేవలు, పెన్షన్లు, రేషన్, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రైతులకు అందించే ఆర్థిక సహాయం తదితర సేవలన్నింటికీ ఆధార్ కీలక గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం ద్వారా ఓటీపీ ఆధారిత సేవలను సులభంగా పొందడంతో పాటు ఆన్‌లైన్ సేవలను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
0–5 సంవత్సరాల పిల్లలకు ఉచిత నమోదు
0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు, అలాగే తొలిసారి ఆధార్ నమోదు చేసుకునే వారికి ఉచితంగా ఆధార్ నమోదు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అలాగే 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు బయోమెట్రిక్ వివరాల నవీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని సూచించారు. ఆధార్ నమోదు లేదా నవీకరణ కోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాలు, పోస్టాఫీసులు, బ్యాంకులు లేదా ప్రభుత్వం గుర్తించిన సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. అవసరమైన గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆధార్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, మొబైల్ నంబర్ వంటి వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, అధికారిక కేంద్రాల్లో మాత్రమే నమోదు, నవీకరణ సేవలను పొందాలని ప్రజలకు సూచించారు. జిల్లాలోని ప్రతి కుటుంబం తమ ఆధార్ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైన సవరణలు వెంటనే పూర్తి చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందడంతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

