సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 అమలుకు కార్యాచరణ – అన్ని శాఖల సమన్వయంతో పరిశుభ్ర జిల్లానే లక్ష్యం
A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (27)జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ఘన వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేసి సేకరించే విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)పై సమీక్ష సమావేశంలో ఆమె ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటి వద్దే చెత్తను నాలుగు విభాగాలుగా వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, పొడి చెత్తను బ్లూ డబ్బాలో, సానిటరీ వ్యర్థాలను రెడ్ డబ్బాలో, హానికరమైన వ్యర్థాలను బ్లాక్ డబ్బాలో వేర్వేరుగా నిల్వ చేసి సేకరణకు ఇవ్వాలని తెలిపారు. జూలై 1 నుంచి చెత్తను కలిపి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. హోటళ్లు, హాస్టళ్లు, పరిశ్రమలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఆస్పత్రులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తమ వ్యర్థాలను స్వయంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఈ సంస్థలకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చెత్త సేకరణ కోసం నాలుగు రంగుల ప్రత్యేక డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 నిబంధనలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

