A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 23:
మెదక్ జిల్లా (22) జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 3,340 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2025 ఆగస్టు వరకు జిల్లాలో 20,758 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ 2026 ఆగస్టు వరకు ఇప్పటివరకు 19,045 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. ప్రతి రోజు మండలాల్లో సుమారు 1,000 నుంచి 1,500 బ్యాగుల వరకు ఎరువులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
ఎరువుల బుకింగ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు
ఆగస్టు 7, 2026న జిల్లాలో ఎఫ్ ఎస్ ఎస్ (Framework for Fertilizer Sale) ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తగా ప్రారంభించిన యాప్‌లో ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలపై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా, రైతులు తమ మండలంతో పాటు ఇతర మండలాల్లో కూడా ఎరువులు కొనుగోలు చేసే విధంగా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. అయితే రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా డివిజన్ వారీగా ఎరువుల సరఫరాకు అనుగుణంగా యాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
అవసరానికి మించి బుకింగ్ చేయొద్దు
అందుబాటులో ఉన్న ఎరువుల కంటే ఎక్కువగా రైతులు బుకింగ్ చేయడం వల్ల యాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కొందరు రైతులు తమ అవసరాలకు మించి ఎరువులు కొనుగోలు చేయడం వల్ల నిజంగా అవసరమైన రైతులకు ఎరువులు అందడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సూచనలు పాటిస్తూ అవసరమైన మేరకే యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న ఎరువులను రైతులందరికీ సమానంగా అందేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

