A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 7:18 am Posted by : A2TV NEWS

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలక శక్తి

వ్యసనాలకు కాదు.. లక్ష్య సాధనకు అడుగులు వేయాలి

డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు చేరువగా ఉండాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా జూన్ 23 :యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మెదక్ టౌన్ సీఐ మహేష్ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించే ఉద్దేశంతో మంగళవారం వన్-డే క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.ఈ పోటీలను జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉందని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత తమ శక్తి, సామర్థ్యాలను సానుకూల దిశలో వినియోగిస్తే దేశాభివృద్ధికి బలమైన శక్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మాదకద్రవ్యాలు యువత జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు అడుగులు వేయడం జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుందని, ఒకసారి వాటికి బానిసైతే ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు, కుటుంబ బంధాలు, వ్యక్తిత్వం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించారు. “డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి… క్రీడలకు ‘ఎస్’ చెప్పండి” అనే సందేశాన్ని ప్రతి యువకుడు ఆచరణలో పెట్టాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.జీవితంలో విజయాలను సాధించేందుకు క్రీడలు ఒక మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మంచి మార్గదర్శకులుగా ఉండాలని, సమాజంలోని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.

మెదక్ జిల్లా పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, విద్యాసంస్థల్లో చైతన్య సదస్సులు నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించి డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాను నిర్మించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.