A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:07 am Posted by : A2TV NEWS

ఈ నెల 27న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

6 వేల మందితో ‘మెతుకు సీమ’ సాంప్రదాయ శోభాయాత్ర.. వివిధ కళారూపాల ప్రదర్శన

పర్యాటక ప్రాంతాలను విద్యుత్ కాంతులతో దేదీప్యమానం చేయాలి: అదనపు కలెక్టర్‌ నగేష్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:

మెదక్ జిల్లా (22) ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఈ నెల 27న జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో పర్యాటక దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ నగేష్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సుమారు 6 వేల మందితో ‘మెతుకు సీమ’ సాంప్రదాయ శోభాయాత్ర, ర్యాలీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

వివిధ కళారూపాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు. చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలను విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దాలని సూచించారు. యువ టూరిజం క్లబ్‌లలో నమోదైన విద్యార్థులకు పర్యాటక, వారసత్వ సంపదపై మండల, జిల్లా స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని డీఈఓ, డీఐఈఓలను ఆదేశించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో, బాధ్యతాయుతంగా నిర్వహించి వేడుకలను విజయవంతం చేయాలని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని అదనపు కలెక్టర్‌ నగేష్ సూచించారు. సమావేశంలో పర్యాటక శాఖ అధికారి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డీఈఓ రాజు, ఈడీఎం సందీప్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.