ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషితో మంజూరు
ఆరోగ్య రంగంలో మెదక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రోహిత్ రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4:
మెదక్ జిల్లా ( 3) మెదక్ నియోజకవర్గంలో ఆరోగ్య రంగం, వైద్య విద్య అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవతో మెదక్ నర్సింగ్ కాలేజీకి రెండు ఆధునిక బస్సులు మంజూరయ్యాయి. దీంతో కళాశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా మెదక్ నర్సింగ్ కాలేజీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, ప్రాక్టికల్ శిక్షణకు అవసరమైన వసతులు, నియోజకవర్గంలో వైద్య సేవల బలోపేతంపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, శిక్షణ అందేలా నర్సింగ్ కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎమ్మెల్యే చొరవకు ఫలితంగా నర్సింగ్ కాలేజీకి రెండు ఆధునిక బస్సులు మంజూరు కావడం పట్ల విద్యార్థులు, కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బస్సుల అందుబాటుతో విద్యార్థుల రవాణా సమస్యలు తగ్గడంతో పాటు విద్యా, ప్రాక్టికల్ కార్యకలాపాలకు మరింత సౌకర్యం కలగనుంది.
త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం
మరోవైపు మెదక్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభంపైనా సమావేశంలో చర్చించారు. కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే అత్యవసర, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందే అవకాశం ఉంటుంది. మెదక్ నియోజకవర్గాన్ని ఆరోగ్య రంగంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వైద్య విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.